త్వష్ట అనే ప్రజాపతి ఒక మహాకాయుణ్ణి సృష్టించి, వాడికి వృత్రాసురుడని పేరుపెట్టాడు. వాడు దినదినానికీ నూరు బాణాల ఎత్తు పెరగసాగాడు.
'ఇంద్రుడు అకారణంగా నీ అన్నను చంపాడు. నువ్వు ఇంద్రుణ్ణి హతమార్చి, నా పగ చల్లార్చు. లోకంలోని ఏ లోహంతో చేసినదైనా, తడిదైనా, పొడిదైనా ఏ ఆయుధమూ నిన్నేమీ చేయలేదు' అని త్వష్ట వృత్రుణ్ణి ఆజ్ఞాపించాడు.
వృత్రాసురుడు రాక్షసులందరినీ కూడగట్టుకుని, దేవతలపై దాడులు మొదలుపెట్టాడు. దేవతలు వాడు పెట్టే బాధలు పడలేక, వెళ్లి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు.
బ్రహ్మ, 'వాణ్ణి జయించడానికి ఒక ఉపాయం ఉన్నది. దధీచి మహర్షి శివార్చన చేసి, తన ఎముకలు వజ్రాలంత గట్టిగా ఉండే విధంగా వరం పొంది ఉన్నాడు. మీరందరూ వెళ్లి దానశీలి అయిన దధీచిని యాచించి అతని ఎముకలు తీసుకొని వాటిని ఆయుధాలుగా ఉపయోగించి వృత్రాసురుణ్ణి సంహరించండి' అన్నాడు.
ఇంద్రుడు దేవతలతో దధీచి ఆశ్రమానికి వెళ్లి, అతని అస్థికలను ఇవ్వవలసిందని అర్ధించాడు. దధీచి అందుకు సమ్మతించి, ఇంద్రుడికి తన ఎముకలను ఇస్తున్నానని చెప్పి, ప్రాణాలు వదిలాడు. అప్పుడు దేవ శిల్పి విశ్వకర్మ దధీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని నిర్మించి, ఇంద్రుడికిచ్చాడు. ఇంద్రుడు దేవసేనలతో వృత్రాసురుడిపైకి యుద్ధానికి వెళ్లి, అహోరాత్రాలు పోరాడాడు. ఆ వజ్రాయుధం కూడా వృత్రాసురుణ్ణి ఏమీ చేయలేకపోయింది.
అప్పుడు ఇంద్రుడు జగదంబను ప్రార్ధించాడు. ఆమె ప్రత్యక్షమై వజ్రాయుధం సహాయంతో సముద్రపు నురుగును వాడిపైన ప్రయోగించమని చెప్పింది. ఇంద్రుడు సముద్రతీరానికి వెళ్లి, సముద్రపు నురుగును వజ్రాయుధానికి పట్టించి ప్రయోగించాడు. లోహంతో చేయనిదీ, తడిదీ, పొడిదీ కాని ఆ ఆయుధంతో వృత్రాసురుడు చచ్చాడు.